జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
- ఎస్పీ తుషార్ డూడికి వినతిపత్రం అందజేత
- పాల్గొన్న ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌క్లబ్ నాయకులు
చిత్తూరు : కుప్పంలో వార్తల సేకరణ నిమిత్తం వెళ్లిన సాక్షి టీవీ జర్నలిస్ట్ గణేష్, స్టాఫ్ కెమెరామెన్ శ్రీకాంత్‌లపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌క్లబ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు సోమవారం పాత జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మురళికృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కేయం .అశోక్ కుమార్ , చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద మాట్లాడుతూ విధి నిర్వహణలో వార్తలు సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. మెగా డీఎస్సీలో ఓ ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలపై రెండు రోజుల క్రితం అభిప్రాయం తీసుకునేందుకు జర్నలిస్టులు అక్కడికి వెళ్లారని చెప్పారు. అయితే ఆ ఉపాధ్యాయుడు జర్నలిస్టులపై తప్పుడు ఫిర్యాదు చేశాడరన్నారు. ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం దారుణమన్నారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్‌లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలలో ఒకటైన పత్రికా రంగాన్ని భయబ్రాంతులకు గురిచేసేలా కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇటువంటి అక్రమ కేసులు బనాయించి పత్రికలను అణచివేయాలని చూడడం సబబు కాదన్నారు. జర్నలిస్టుల సమస్యలకు ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్రంగా, పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేపడుతామన్నారు. విచారణలో నిజానిజాలు నిగ్గుతేల్చి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కార్యదర్శి కాలేశ్వర రెడ్డి , ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ , కార్యవర్గ సభ్యులు రాజేష్ ,బాలసుందరం, చంద్ర ప్రకాష్ , జీకే శివ , హరీష్, ఏపీయూడబ్ల్యుజే కార్యవర్గ సభ్యుడు సురేష్, పాత్రికేయులు కిషోర్, సింగ్, గణేష్, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.