ఢిల్లీ: ఏపీ భవన్‌లో ప్రత్యేక రైస్ అవుట్‌లెట్ ప్రారంభం
ఢిల్లీ: ఏపీ భవన్‌లో ప్రత్యేక రైస్ అవుట్‌లెట్ ప్రారంభం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రెసిడెంట్ కమిషనర్ చొరవతో ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్‌లెట్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతులు కష్టపడి పండిస్తున్న ధాన్యానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. ఢిల్లీలో స్థిరపడిన, నివసిస్తున్న తెలుగు ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆంధ్రప్రదేశ్ బియ్యం, మన ఊరి రుచులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
రైస్ అవుట్‌లెట్‌లో కేఎన్ఎం, బీపీటీతో పాటు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారికి కూడా అత్యుత్తమ నాణ్యత కలిగిన సరుకులను అందించేలా వ్యవస్థను విస్తరిస్తామన్నారు.
అదేవిధంగా ఎన్‌సీసీఎఫ్ ద్వారా 64 రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు విక్రయించేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు రైతులకు కూడా మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.