తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
అన్నమయ్య జిల్లా, మదనపల్లి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మదనపల్లిలోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తాగునీటి లభ్యత, ప్రస్తుతం ఉన్న నీటి వనరుల పరిస్థితి, రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అవసరమైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు, భూగర్భ జలాలను రీచార్జ్ చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.