కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. డొంకేశ్వర్‌లో (సీ ఎం)రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..
డొంకేశ్వర్, సెప్టెంబర్ 7:తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను హతమార్చడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇటీవల జరిగిన దాడి ఘటనలు ఈ విధమైన అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గనుక అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయనను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు జరిగి ఉండేవని ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని డొంకేశ్వర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక "రాజకీయ ఉగ్రవాది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి క్రిమినల్ బుద్ధి తెలిసే తాము (బీఆర్ఎస్ నేతలు) అప్రమత్తంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. సభలో ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని రేవంత్ సర్కార్ బెదిరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి పరాభవిస్తారా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత శాసనసభ గౌరవసభ కాదని, అది ఒక 'కౌరవసభ' అని అభివర్ణిస్తూ.. ఈ రోజును ఒక బ్లాక్ డే (నల్లదినం)గా ప్రకటించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి ఎన్నో కుట్రలను, దాడులను తిప్పికొట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి కామెడీ చర్యలను ఎదుర్కోవడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.