పిట్టంపల్లిలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ మెయిన్ లైన్లు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో మెయిన్ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలికి విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగులుతూ మంటలు, నిప్పులు రేగుతున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను సంబంధిత లైన్‌మన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పినప్పుడు “పై అధికారికి కంప్లైంట్ చేస్తాం అంటే చేసుకో” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మెయిన్ విద్యుత్ లైన్ల కింద చిన్నపిల్లలు ప్రతిరోజూ ఆడుకుంటుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
వైర్లు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత కాకుండా ముందుగానే విద్యుత్ అధికారులు స్పందించి, ప్రమాదకరంగా ఉన్న వైర్లను సరిచేసి, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పిట్టంపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు