వివాహితపై అత్యాచారం, దోపిడీ కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
NYODAY NEWS : నల్లగొండ
వివాహితను అపహరించి, అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె ఆభరణాలను దోపిడీ చేసిన కేసులో నిందితుడు బానోత్ శ్రీను అలియాస్ చిన్నా (35)కు నల్లగొండ మహిళా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది.
వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడు టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలను వారి గమ్యస్థానానికి తీసుకెళ్తున్న సమయంలో, భర్త వాహనం దిగిన వెంటనే వివాహితను బలవంతంగా అపహరించాడు. అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఆభరణాలను దోపిడీ చేసి మార్గమధ్యలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి ఎస్ఐ కె. నరసింహారావు, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ అప్పటి సీఐ ఏ. రమేష్ బాబు ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిల ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.
విచారణ అనంతరం న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్లు, సెక్షన్ 376 కింద పదేళ్లు, సెక్షన్ 392 కింద ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. మూడు సెక్షన్ల కింద మొత్తం రూ.20 వేల జరిమానా కూడా విధించింది.
మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. కేసు దర్యాప్తు, విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రాసిక్యూషన్ బృందాన్ని ఆయన అభినందించారు.