పెనుగొలనులో అడవి బాపిరాజు వర్ధంతి వేడుకలు
బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి బాపిరాజు వర్ధంతి వేడుకలు
కళాకారులకు ఘన సన్మానం
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ రచయిత అడవి బాపిరాజు 74వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడవి బాపిరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1895 అక్టోబర్ 8న కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు అడవి బాపిరాజు జన్మించారని తెలిపారు. ఆయన రచించిన నారాయణరావు నవల తెలుగు సాహిత్యంలో తొలి సాంఘిక నవలగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. హిమబిందు, గోనగన్నారెడ్డి వంటి నవలలతో పాటు బావా బావా పన్నీరు వంటి పాటలు తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వివరించారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ అడవి బాపిరాజు చురుకుగా పాల్గొన్నారని వక్తలు తెలిపారు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. చిత్రకారుడిగా, కళాకారుడిగా, నాటక రచయితగా, చలనచిత్ర దర్శకుడిగా, పత్రికా సంపాదకుడిగా, అధ్యాపకుడిగా, న్యాయవాదిగా, ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుడిగా ఆయన అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారని కొనియాడారు.
విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన అడవి బాపిరాజు 1952 సెప్టెంబర్ 22న మరణించారని తెలిపారు. ఆయన సాహిత్య, కళా సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా సాయిబాబా సేవా కమిటీ సభ్యులు సన్నాయి, డోలక్, హార్మోనియం కళాకారులైన జిడుగుకొండ, మంచికంటి నర్సింహారావు, పొనుగుపాటి శ్రీను, జిడుగు ఉపేంద్ర, పొనుగుపాటి కిట్టయ్యలను జ్ఞాపికలు అందజేసి నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సాయిబాబా సేవా కమిటీ సభ్యులు వూటుకూరి నారాయణరావు, ఇలాసాగరపు పుల్లయ్య, ముక్కెర వెంకట నర్సిరెడ్డి, వీసం రాంప్రసాద్, యర్రమల నాగిరెడ్డి, శీలం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.