మధిరకు మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు
ఖమ్మం జిల్లా మధిరకు మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది. రాష్ట్రవ్యాప్తంగా 200 సివిల్, క్రిమినల్, అదనపు కోర్టులను ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మంకు ఆరు, మధిరకు ఒకటి, సత్తుపల్లికి ఒక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేశారు. మధిరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు కావడంపై మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రామరాజు, న్యాయవాది గంధం శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు వారు ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
మధిరలో ఐదుకు చేరిన కోర్టుల సంఖ్య
కొత్తగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు కావడంతో మధిరలో మొత్తం కోర్టుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటివరకు ఉన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు తోడు తాజాగా మరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అందుబాటులోకి రానుంది. వీటితో పాటు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (సబ్ కోర్టు) ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్త కోర్టుతో మధిరలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల సంఖ్య మూడుకు, మొత్తం కోర్టుల సంఖ్య ఐదుకు చేరింది.