వరి పంటలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలి
కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు: సీపీఎం, రైతు సంఘం
NTODAY NEWS : చిట్యాల
వ్యవసాయ రంగానికి అవసరమైన మేరకు నిరంతర విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అరూరి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరి పంటలకు నీరు అత్యవసరంగా అవసరమైన సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, సీపీఎం మండల నాయకులు నెలికంటి నర్సింహా, పంది నరేష్, రైతు సంఘం నాయకులు సుర్కంటి మోహన్‌రెడ్డి, అరూరి శంభయ్య, ఆడపు రమేష్, సుర్కంటి పాపిరెడ్డి, నెర్లకంటి కృష్ణారెడ్డి, యంపళ్ల సత్తిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.