బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు.
అల్పపీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాటికి వాయుగుండంగా, మంగళవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపారు. బుధవారం నాటికి ఈ వ్యవస్థ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.