నూజివీడు పరిధిలో రెన్యువల్ కాని మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణానికి కొత్త లైసెన్స్ జారీ చేసేందుకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ముసునూరు మండలంలోని గెజిట్ సీరియల్ నంబర్ 93కు సంబంధించిన మద్యం దుకాణం లైసెన్సుదారు రెన్యువల్ చేసుకోకపోవడంతో, ఆ దుకాణానికి లాటరీ పద్ధతిలో అర్హులైన అభ్యర్థుల్లో ఒకరిని ఎంపిక చేసి లైసెన్స్ జారీ చేయనున్నట్లు నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ కోసం నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల దరఖాస్తు రుసుముతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్, చలాన్ లేదా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఒకే అభ్యర్థి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చని స్పష్టం చేశారు.
సదరు మద్యం దుకాణానికి వార్షిక లైసెన్స్ రుసుము రూ.71.50 లక్షలుగా, పర్మిట్ రూమ్ రుసుము రూ.7.50 లక్షలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తులను అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. అందిన దరఖాస్తులను అక్టోబర్ 3న పరిశీలించి అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ సమక్షంలో అక్టోబర్ 5న లాటరీ నిర్వహించి లైసెన్స్ పొందే విజేతను ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య వెల్లడించారు.