శబరిమల అయ్యప్ప భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సు అద్దె సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీసం ఐదు రోజుల పాటు బస్సును అద్దెకు తీసుకునే గ్రూపులకు ప్రత్యేక రాయితీ, ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పథకం కింద గురుస్వామికి రూ.2 వేల కమిషన్‌తో పాటు మరో ఏడుగురు సహాయకులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. వంటవారు, మణికంఠలు, ఇతర సహాయకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం అద్దెకు ఇచ్చే బస్సుల్లో ఆడియో, వీడియో సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. బస్సు రకాన్ని బట్టి కిలోమీటరుకు రూ.52 నుంచి రూ.120 వరకు అద్దెను నిర్ణయించారు. దీనికి అదనంగా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. శబరిమల యాత్రకు బస్సు అద్దెకు తీసుకోవాలనుకునే భక్తుల గ్రూపులు పూర్తి వివరాల కోసం సమీపంలోని ఏపీఎస్‌ఆర్టీసీ డిపోను సంప్రదించాలని సంస్థ సూచించింది.