సీఎం రేవంత్ రెడ్డికి ఆర్యదాన్ ముహమ్మద్-2026 అవార్డు
తెలంగాణ
/
రంగారెడ్డి
/
బాలాపూర్
నిలంబూర్, సెప్టెంబర్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు లభించింది. కేరళలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు.
ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి రేవంత్ రెడ్డిని రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కేరళతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి.. కేరళకు వచ్చిన ప్రతిసారీ ఆత్మీయ స్వాగతం లభించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ఆర్యదాన్ ముహమ్మద్ చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు.
ఆర్యదాన్ ముహమ్మద్ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, కేరళ ప్రభుత్వాల్లో నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారని ఫౌండేషన్ తెలిపింది. ఆయన ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదంతో అనుబంధం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొంది.
అవార్డు ఎంపిక జ్యూరీలో ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్, ప్రముఖ మేధావి కల్పెట్ట నారాయణన్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళ మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.