లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్ఆర్ జిల్లా డీఆర్ఓ
రూ.50 వేల నగదు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడిలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ–ఎఫ్‌ఏసీ) మారోతు వెంకట సూర్య లోకేశ్వరరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పాడేరు ఆర్డీవో కార్యాలయంలో రూ.50 వేల నగదును స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అమ్ము సూర్య చక్రవర్తికి సంబంధించిన జీతాల బకాయిలు, పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్లు, పే స్కేల్ రెగ్యులరైజేషన్ బిల్లుల ఆమోదం కోసం డీఆర్ఓ లోకేశ్వరరావు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ విశాఖపట్నం రేంజ్ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. పథకం ప్రకారం బాధితుడి నుంచి నగదును స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ బృందం ఒక్కసారిగా దాడి చేసి డీఆర్ఓను అదుపులోకి తీసుకుంది. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, చేతులకు రసాయన పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.