కేంద్ర ఉద్యోగులు, పింఛనర్లకు నేడు ముందుగానే జీతాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపాదిత మూడు రోజుల బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వేతనాలు, పింఛన్లను ఈ నెల 25వ తేదీనే ముందుగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. సాధారణంగా నెలాఖరులో జమ కావాల్సిన ఈ మొత్తాలను బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగకుండా ముందుగానే విడుదల చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రక్షణ, తపాలా, టెలికమ్యూనికేషన్స్ సహా అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాలు, వేతనాలను సెప్టెంబర్ 25న చెల్లించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగుల వేతనాలు, కేంద్ర ప్రభుత్వ పింఛనర్ల సెప్టెంబర్ నెల పింఛన్లను కూడా అదే రోజున చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మెతో పాటు నెలాఖరు, త్రైమాసిక ముగింపు సమయం కావడంతో బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చెల్లింపులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
అయితే సెప్టెంబర్ నెల జీతం, వేతనం, పింఛను ముందుగానే చెల్లించినందున దానిని ముందస్తు చెల్లింపుగా పరిగణిస్తారు. నెల పూర్తయిన తర్వాత తుది మొత్తంలో ఏదైనా సర్దుబాటు అవసరమైతే అక్టోబర్ 2026 జీతం లేదా వేతనం నుంచి సర్దుబాటు చేయనున్నట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ స్పష్టం చేసింది.
బ్యాంకుల సమ్మెకు ముందు సెప్టెంబర్ 27 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేసేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రజలకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.