కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలి
ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలి: మంద వేణుగోపాల్ రెడ్డి
NTODAY NEWS : చిట్యాల
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు కురవక, సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక రైతులు అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వరాష్ట్రంలో రైతుల జీవితాల్లో సంతోషం నిండుతుందని ఆశించామని, ప్రస్తుత పరిస్థితులు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు.
సంఘం ప్రధాన డిమాండ్లు ఇవే..
రాష్ట్రంలో వర్షాభావంతో పంటలు ఎండిపోయిన మండలాలన్నింటినీ వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని మంద వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని, వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయడంతోపాటు వడ్డీ మాఫీ చేయాలని కోరారు. కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగకుండా ఉపాధి హామీ పథకం పనిదినాలను పెంచి, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తాత్సారం చేయకుండా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.