పుంగనూరు మోడల్ పాఠశాలలో కరాటే, యోగా యూనిఫామ్స్ పంపిణీ
పుంగనూరు, అన్నమయ్య జిల్లా: పుంగనూరు పట్టణంలోని రాంనగర్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కరాటే, యోగా యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులు, దాతల సహకారంతో సమకూర్చిన యూనిఫామ్స్‌ను మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి ద్వారా విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శారీరక, మానసిక నైపుణ్యాలను పెంపొందించేందుకు పాఠశాలలో యోగా, కరాటే తరగతులను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేందుకు సహకరించిన తల్లిదండ్రులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి మాట్లాడుతూ.. రాంనగర్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి బుధవారం, శనివారం ప్రత్యేకంగా కరాటే తరగతులతో పాటు యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, దాతలు యూనిఫామ్స్ అందించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు.
పాఠశాలలో విద్యార్థులలో సృజనాత్మకత, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా వివిధ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వారం ‘నో బ్యాగ్ డే’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కళావతి, ఉపాధ్యాయులు హేమలత, చిన్న రెడ్డప్ప, సతీష్ కుమార్, సీఆర్‌పీ నారాయణస్వామి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.