అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
తిరువూరు: ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. పింఛన్ల పంపిణీకి సంబంధించిన నిధులు అక్టోబర్ 1న స్వర్ణ గ్రామాల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
బ్యాంకు సిబ్బంది మూడు రోజుల సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సెర్ప్ విజయవాడ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తిరువూరు ఎంపీడీవో తెలిపారు.
పింఛను లబ్ధిదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు. అదే విధంగా కొత్తగా పింఛను మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి తాజా సమాచారం అందలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిన వెంటనే లబ్ధిదారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు స్వర్ణ గ్రామ సిబ్బంది, అధికారులకు సహకరించాలని ఎంపీడీవో కోరారు.