వెలిమినేడులో రెడీ మిక్స్ ప్లాంట్‌కు అనుమతులు ఇవ్వొద్దు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో ఉన్న వెలిమినేడు గ్రామంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రెడీ మిక్స్ ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం వెలిమినేడు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హోటళ్లు, గ్రామ పంచాయతీ నీటి పంపులు, జనావాసాలకు సమీపంలో రెడీ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ ఏర్పాటును విరమించుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్లాంట్‌కు ఎలాంటి అనుమతులు మంజూరు చేయకూడదని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు నెలికంటి నర్సింహా, పంది నరేష్, గ్రామ శాఖ నాయకులు నాతి వెంకట్రామయ్య, అరూరి శంభయ్య, ఆడపు రమేష్, అరూరి ప్రణీత్, గోలి సాయి కిరణ్, సుర్కంటి పాపిరెడ్డి, నర్సిరెడ్డి, మేడి మనోజ్, మంకాల యాదయ్య, అరూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.