రక్షణ రంగానికి రూ.2.12 లక్షల కోట్ల ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
- రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం.. సైన్యం కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలు, హెలికాప్టర్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
- ఆర్మీ కోసం ఆధునిక వాహనాలు, గన్ సిస్టమ్స్
- డ్రోన్లను ఎదుర్కొనే వ్యవస్థలకు ప్రాధాన్యం
- తదుపరి దశల్లో సేకరణ ప్రక్రియ
న్యూఢిల్లీ | ఎన్ టుడే న్యూస్: భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సుమారు రూ.2.12 లక్షల కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ (AoN) మంజూరు చేసినట్లు వెల్లడించారు.
భారత సైన్యం అవసరాల కోసం హై మొబిలిటీ వెహికల్స్ (HMV), సెల్ఫ్-ప్రొపెల్డ్ ట్రాక్డ్ గన్ సిస్టమ్, లైట్ మల్టీ రోల్ హెలికాప్టర్లు (LMRH), వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (VSHORADS) సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ పరికరాలు సైనిక కార్యకలాపాలు, రవాణా, వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఉపయోగపడనున్నాయి.
నిఘా, డ్రోన్ ఆధారిత దాడులను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ (C-UAS), లాంగ్ రేంజ్ కామికాజ్ డ్రోన్ సిస్టమ్, సర్వైలెన్స్ మానవరహిత వైమానిక వాహనాల (UAVs) కొనుగోలుకు కూడా అనుమతి లభించింది.
డీఏసీ ఇచ్చిన ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ అనేది రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియలో కీలకమైన ప్రారంభ ఆమోద దశ. దీని తర్వాత నిర్దేశిత విధానాల ప్రకారం ఇతర సాంకేతిక, ఆర్థిక, కొనుగోలు ప్రక్రియలు కొనసాగుతాయి.