విద్యుత్ ప్రమాదం చెప్పిరాదు.. అప్రమత్తతే రక్షణ
విద్యుత్ ప్రమాదం చెప్పిరాదు.. అప్రమత్తతే రక్షణ చాట్రాయి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి సంజయ్
తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షాలు.. చాట్రాయి మండల ప్రజలకు విద్యుత్ శాఖ హెచ్చరిక
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని ప్రజలు తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాట్రాయి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, మోటార్లు, స్విచ్ బోర్డులు తదితర విద్యుత్ పరికరాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
తడిసిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోరాదని, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు, ఇతర విద్యుత్ పరికరాలను తాకకూడదని డి. సంజయ్ సూచించారు. విద్యుత్ తీగలకు ఆనుకుని లేదా తగులుతూ ఉన్న చెట్లు, కొమ్మలను ముట్టుకోరాదని, చెట్టు కొమ్మలు విద్యుత్ లైన్లకు తగిలినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత లైన్మన్ లేదా విద్యుత్ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు.
గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగి నేలపై పడిన సందర్భాల్లో వాటిని ముట్టుకోవడం లేదా వాటి వద్దకు వెళ్లడం చేయరాదని హెచ్చరించారు. ఆ ప్రాంతానికి పిల్లలను దూరంగా ఉంచి వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. ఇంట్లోని స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, బయట ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పరికరాలు నీటికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చిన్న పిల్లలను విద్యుత్ స్తంభాలు, తీగలు, స్విచ్ బోర్డులు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. ఇంట్లో ఉతికిన బట్టలను విద్యుత్ తీగలు లేదా ఇనుప తీగలపై ఆరబెట్టకూడదని సూచించారు. వాటర్ హీటర్ వినియోగించే సమయంలో ముందుగా స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ తొలగించిన తర్వాతే సంబంధిత పరికరాలను ముట్టుకోవాలని చెప్పారు.
ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో డిష్ కనెక్షన్ తొలగించాలని, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి విద్యుత్ పరికరాల స్విచ్‌లను ఆఫ్ చేసి అవసరమైతే ప్లగ్‌లను తొలగించాలని సూచించారు. విద్యుత్ లైన్ల సమీపంలో బహిరంగంగా సెల్‌ఫోన్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఇంటికి వచ్చే సర్వీస్ వైర్ దెబ్బతిన్నా, తెగినా లేదా ప్రమాదకరంగా కనిపించినా ప్రజలు స్వయంగా దానిని ముట్టుకోకుండా వెంటనే సంబంధిత జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, ఎల్‌ఎం, ఎల్‌ఐ, సబ్‌స్టేషన్, ఏఈ లేదా 1912కు సమాచారం అందించాలని చాట్రాయి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి. సంజయ్ కోరారు.
తుఫాన్ సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ శాఖ సిబ్బంది సూచనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదం చెప్పిరాదు.. ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణాలను కాపాడుకోవచ్చని డి. సంజయ్ తెలిపారు.