ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠం.. ఇద్దరు రాజకీయ వారసురాళ్ల మధ్య హోరాహోరీ!
చింతమనేని నవ్యశ్రీ, మందలపు జాహ్నవి వైపు రాజకీయ వర్గాల చూపు అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి? జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై రాజకీయ ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అధికార కూటమిలో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల కుమార్తెల పేర్లు తెరపైకి రావడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యశ్రీకి అవకాశం దక్కుతుందా? లేక చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె మందలపు జాహ్నవిని జెడ్పీ చైర్మన్ పీఠం వరిస్తుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయ వారసత్వం.. ఇద్దరికీ బలమైన నేపథ్యం చింతమనేని నవ్యశ్రీ, మందలపు జాహ్నవి ఇద్దరూ యువతులు కావడం, విద్యావంతులు కావడంతో పాటు బలమైన రాజకీయ నేపథ్యం కలిగి ఉండటం ఈ పోటీపై ఆసక్తిని పెంచుతోంది. తమ తమ రాజకీయ కుటుంబాల ప్రాబల్యం, పార్టీ నాయకత్వంతో ఉన్న సంబంధాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు ఈ ఎంపికలో కీలకంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేవలం ఒక పదవిగానే కాకుండా జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన స్థానంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల కుటుంబాల నుంచి పేర్లు వినిపిస్తుండటంతో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక, రాజకీయ సమీకరణాలు, పార్టీ అవసరాలు, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై అధికారిక స్పష్టత లేదు. దీంతో ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుంది? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.