అర్నాబ్ తుపాను ప్రభావం.. అల్లకల్లోలంగా విశాఖ తీరం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..
10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం ప్రమాదకరంగా మారిన బీచ్‌లు.. రుషికొండ బీచ్‌ను మూసివేసిన ఏపీ పర్యాటక శాఖ విశాఖపట్నం: అర్నాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు, పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. సముద్రం సాధారణ స్థాయికి మించి సుమారు 10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చినట్లు సమాచారం. అలల ఉద్ధృతి కారణంగా తీరం భారీగా కోతకు గురవుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. తుపాను ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో బీచ్‌ల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బీచ్‌లలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రుషికొండ బీచ్‌ను ఏపీ పర్యాటక శాఖ మూసివేసింది. సముద్రంలోకి వెళ్లడం, అలల సమీపంలోకి వెళ్లి ఫొటోలు దిగడం వంటి సాహసాలకు పర్యాటకులు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు తీర ప్రాంత ప్రజలు, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు.