అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
ఓట్ల తొలగింపునకు కారణాలను బహిర్గతం చేయాలి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్
ఏలూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను బహిర్గతం చేయాలని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ కారణంగా 44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, పేదలు, వలస కార్మికులు ఓటు హక్కును కోల్పోవడం ప్రజాస్వామ్యానికి నష్టమని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ పేరుతో తొలగించిన 44 లక్షల ఓట్లను సమగ్రంగా పరిశీలించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ నెల 22న సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల సంఘానికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను పునఃపరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం అధికారుల విధానాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిందని, ఆదరాబాదరాగా ఓటర్ల జాబితాను సవరించడం వల్ల అర్హులైన వారు కూడా ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం లోపభూయిష్టంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపునకు సరైన కారణాలు తెలియజేయకుండా, సంబంధిత ఓటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అర్హులైన వారి ఓట్లను సైతం తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఓట్లను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.
ఆర్‌పీఐఏ పార్టీ జిల్లా నాయకుడు మతే బాబి మాట్లాడుతూ దళిత, గిరిజన, బహుజన వర్గాలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు బుద్ధ సోమయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ పేరుతో తొలగించిన 44 లక్షల ఓట్లకు సంబంధించిన కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి అఖిలపక్ష నాయకులు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బహుజన సమాజ్ వాదీ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అంగదుల రమాకాంత్, సీపీఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కొండేటి రాంబాబు, బళ్ల కనకదుర్గారావు, ఎం.ఎ. హకీమ్, నాగం అచ్యుత్, సీపీఎం నాయకులు మంచెల్ల ఇస్సాకు, కమ్మిలి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.