రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలి
వెలిమినేడు సబ్స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతు ధర్నా
NTODAY NEWS : చిట్యాల
రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సబ్స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్న పరిస్థితులను తిరిగి తీసుకొస్తామని చెప్పారని, ప్రస్తుతం రైతులకు సక్రమంగా విద్యుత్, సాగునీరు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి విద్యుత్ ఉత్పత్తి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతుల మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తో పాటు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు..