విద్యార్థులకు ఉచిత ఆధార్ అప్‌డేట్ డ్రైవ్
పుంగనూరు: విద్యార్థుల ఆధార్ వివరాలను నవీకరించుకునేందుకు ప్రభుత్వం మరోసారి ప్రత్యేక అవకాశం కల్పించింది. సోమవారం నుంచి అక్టోబర్ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉచిత ఆధార్ అప్‌డేట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలు, అంటే వేలిముద్రలు, ఐరిస్ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఇంకా పలువురు విద్యార్థులు బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే అప్‌డేట్ చేయాల్సిన విద్యార్థుల జాబితాలను పాఠశాలలకు పంపినట్లు, మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక శిబిరాల్లో ఆధార్ వివరాల సవరణతో పాటు కొత్త ఆధార్ నమోదు ప్రక్రియను కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తీసుకురావాల్సిన పత్రాలు
కొత్త ఆధార్ నమోదు కోసం జనన ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకురావాలని సూచించారు. వివరాల్లో మార్పులు చేసుకునే వారు అవసరాన్ని బట్టి జనన ధ్రువపత్రం, పదో తరగతి మార్కుల జాబితా లేదా చిరునామా ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ వివరాలను నిర్ణీత సమయంలో అప్‌డేట్ చేయించాలని అధికారులు కోరారు.