విశాఖలో అక్టోబర్ 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ
ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులకు చేయూత అందించేందుకు విశాఖపట్నంలో అక్టోబర్ 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ, రోటరీ ఎల్ఎన్-4 హ్యాండ్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఈగల్ (EAGLE) బృందం సహకారం అందించనుంది. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, రైలు ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన వారు తమ ఫొటోలతో పాటు అవసరమైన వివరాలను అందించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం 8866306969 నంబర్‌ను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి సందేహాలుంటే ఈగల్ కాల్ సెంటర్ 1972 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రమాదాల్లో చేతులు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చేలా సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, అర్హులైన బాధితులకు సమాచారం చేరవేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకే రవికృష్ణ విజ్ఞప్తి చేశారు.