గురు రవిదాస్ చిత్రపటంపై ఇంకు చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
నల్గొండ జిల్లా చిట్యాల: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటంపై నల్ల ఇంకు చల్లడం అవమానకర చర్య అని సంత్ రవిదాస్ రాష్ట్ర కన్వీనర్ మాస శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆగస్టు 31న జరిగిన ఘటనపై బాధ్యులైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చిట్యాల పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా, సమగ్ర మోచి సంఘం ఆధ్వర్యంలో ఎస్సైకి ఫిర్యాదు అందజేశారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస శ్రీనివాస్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల ఆరాధ్య దైవంగా భావించే గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని అవమానించడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా. రుద్రవరం లింగస్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, జిల్లా సీనియర్ నాయకులు చిక్కం మెట్ల అశోక్, మాజీ కౌన్సిలర్ కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జయరపు రామకృష్ణ, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్ రెడ్డి, సమగ్ర మోచి చిట్యాల సంఘం సభ్యులు చంద్రగిరి రవికుమార్, మాస నరేష్, దంతుల నవీన్ కుమార్, చంద్రగిరి శివమదన్, చంద్రగిరి శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.