నలుగురు ఎస్‌ఐలకు ఘన వీడ్కోలు
వరంగల్, సెప్టెంబర్ 30: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పదవీ విరమణ పొందిన ఎస్‌ఐలు ఎం. లక్ష్మీనారాయణ, పి. కొమురయ్య, సీహెచ్. పర్శురాములు, బి. రమేష్‌లను శాలువాలతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మినిస్ట్రేషన్) ఆర్. ప్రభాకర్ రావు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్) సురేష్, ఏసీపీ అడ్మిన్ (ఏఆర్) ఎస్. సురేంద్ర, ఆర్‌ఐ సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కర్ణాకర్, పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ చేసిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.