పెనుగొలనులో వైభవంగా గణపతి నిమజ్జనం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం వెనుక కొలువై ఉన్న శ్రీ గణపతికి బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు నిర్వహించిన లక్కీ డ్రాలో గుండాల అప్పారావు విజేతగా నిలిచి 11 కేజీల లడ్డూను అందుకున్నారు. అనంతరం నిర్వహించిన పాట కార్యక్రమంలో శంకర్ ఆరువేలు 9 కేజీల లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ ప్రధాన వీధుల్లో ఘనంగా ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం శివాలయం వద్ద ఉన్న చెరువులో గణపతి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గంపలగూడెం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గణపతికి వైభవంగా కల్యాణం
పెనుగొలను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో కొలువై ఉన్న శ్రీ గణపతికి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కరాచార్యులు సిద్ధి, బుద్ధి సమేత గణపతికి మేళతాళాల నడుమ వేదమంత్రాలు పారాయణం చేస్తూ కల్యాణ తంతును నిర్వహించారు. పలువురు దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం భక్తుల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి కల్యాణం, అన్నసంతర్పణ కార్యక్రమాలను నిర్వాహక కమిటీ సభ్యులు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై గ్రామస్తులు అభినందనలు తెలిపారు.