హైటెక్ హంగులతో రూ.6 వేల కోట్ల స్కామ్.. వేలాది మందిని ముంచిన కంపెనీ ఎండీ అరెస్ట్
హైదరాబాద్, జూలై 6: అధిక లాభాల పేరుతో దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది పెట్టుబడిదారులు మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 1,500 మంది ఉన్నట్లు సమాచారం.
హైటెక్ కార్యాలయాలతో నమ్మకం 2020లో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ పేర్లతో సంస్థలను ప్రారంభించిన భూపాల్ నాయక్.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో హైటెక్ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. స్టాక్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నామని, సెబీలో నమోదు చేసుకున్న సంస్థ అని ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించాడు.
48 శాతం వరకు లాభాల హామీ పెట్టుబడులపై ఏడాదికి 18 శాతం, 30 శాతం, 48 శాతం వరకు లాభాలు వస్తాయని వివిధ పథకాలను ప్రకటించారు. రూ.12.5 లక్షలు పెట్టుబడి పెడితే 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌తో పాటు 24 శాతం లాభం ఇస్తామని నమ్మించారు. దీంతో వందలాది మంది తమ పొలాలు, బంగారం అమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు.
మొదట కొంతకాలం లాభాలు చెల్లించిన సంస్థ.. గత ఏడాది సెప్టెంబర్ నుంచి చెల్లింపులు నిలిపివేసింది. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు మోసపోయినట్లు గుర్తించారు.
ఈవోడబ్ల్యూలో కేసు నమోదు విశ్రాంత నేవీ అధికారి సంజీవ్ గుప్తా సహా పలువురు బాధితులు రూ.4.51 కోట్ల పెట్టుబడులు పెట్టి మోసపోవడంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)లో జూన్ 15న ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా మోసాలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గుజరాత్‌లో నమోదైన కేసు నేపథ్యంలో భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గుజరాత్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
జిల్లాలో ప్రచార కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లాలో కిసాన్ పరివార్ పేరుతో భూపాల్ నాయక్ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. గ్రామాల్లో బోర్లు తవ్వించడం, విద్యార్థులకు బస్‌పాస్‌లు, ఆర్థిక సహాయాలు అందించడం, బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదు.
ఈ భారీ ఆర్థిక మోసంలో భూపాల్ నాయక్‌కు మరికొందరు సహకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.