కరీంనగర్ జిల్లా ఊటూరులో ఇసుక లారీల అడ్డదిడ్డంగా పార్కింగ్
- ఊటూరులో ఇసుక లారీల ఇష్టారాజ్యం.. అంబులెన్స్‌కూ దారి లేని దుస్థితి!
- రోడ్డును దిగ్బంధిస్తున్న లారీలు.. అత్యవసర సమయంలోనూ తప్పని ట్రాఫిక్ కష్టాలు
కరీంనగర్ జిల్లా, ఊటూరు (ఎన్ టుడే న్యూస్): ఇసుక లారీల అడ్డదిడ్డమైన పార్కింగ్‌తో కరీంనగర్ జిల్లా ఊటూరు గ్రామంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. చివరకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిన అంబులెన్స్‌కు సైతం దారి లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ ఇసుక లారీల పార్కింగ్ కారణంగా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, అతికష్టం మీద మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అత్యవసర సమయాల్లో ఇసుక లారీల పార్కింగ్ ఎంతటి సమస్యగా మారిందో స్పష్టమవుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
మానకొండూరు నుంచి వీణవంక వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఇసుక లారీలను రోడ్లపై నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అంటున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక లారీలను గ్రామాలు, ప్రధాన రహదారుల గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.