కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
ప్రమాదకరంగా వదిలేసిన గుంతలు.. హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి కారణమని బాధితుడి ఆరోపణ
ఎల్కతుర్తి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల బాధ్యతారాహిత్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఎల్కతుర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం మరోసారి చాటిచెప్పింది. కేబుల్ లైన్ల ఏర్పాటు కోసం రోడ్డు పక్కన తవ్విన గుంతను పూడ్చకుండా వదిలేయడంతో బైక్‌పై వెళ్తున్న ఓ గ్రామీణ వైద్యుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
ట్రాక్టర్‌కు సైడ్ ఇవ్వబోయి గుంతలోకి..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలోని రైతు వేదిక సమీపంలో ఉన్న జీలుగుల క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆడెపు శ్రీవర్ధన్ అనే ఆర్ఎంపీ వైద్యుడు ఉదయం 7 గంటల సమయంలో విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై వెళ్తున్నారు.
అదే సమయంలో ఎదురుగా వడ్ల లోడ్‌తో వస్తున్న గుర్తుతెలియని ట్రాక్టర్‌కు సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ప్రమాదకరంగా తెరిచి ఉన్న గుంతలోకి బైక్‌తో సహా దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో శ్రీవర్ధన్‌కు వెన్నుపూసతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనులే కారణమని ఆరోపణ
స్థానికుల కథనం ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) లైన్ల ఏర్పాటు కోసం ఈ గుంతను తవ్వింది. పనులు పూర్తయిన తర్వాత గుంతను పూడ్చి రోడ్డును యథాస్థితికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ అలాగే వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ప్రమాద సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు శ్రీవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
గుంతలు తవ్వి ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వదిలేసిన బీఎస్ఎన్ఎల్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీవర్ధన్ డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. రోడ్ల పక్కన ప్రమాదకరంగా ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
బాధితుడిని పరామర్శించిన చేనేత ఐక్య వేదిక నాయకుడు
పద్మశాలి చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి చిడురాల వెంకటేశ్వర్లు ప్రమాదంలో గాయపడిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీవర్ధన్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.