తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఎన్‌టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
విజయవాడ: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్‌టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 25న ఒక రోజు సెలవు ప్రకటించింది.
విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు రాకపోకలు సాగించే సమయంలో వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి అసౌకర్యం లేదా ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవును పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.