పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట, సెప్టెంబర్ 24: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి ఐపీఎస్ గురువారం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో జగదీష్ ఆదహళ్లిని పల్నాడు జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన పోలీసు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు శాఖ పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీసు సేవలు అందించడమే తన ప్రాధాన్యతగా పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్‌కు సంబంధించిన ఘర్షణల నియంత్రణతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ప్రజలు తమ సమస్యలు, సమాచారం ఏదైనా పోలీసు శాఖ దృష్టికి తీసుకురావచ్చని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్‌డివిజన్ల పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమై ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతలు, పోలీసింగ్‌కు సంబంధించిన అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు, సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య, గురజాల డీఎస్పీ మహేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ గాంధీ రెడ్డి, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్‌ఐలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.