జగన్ కీలక వ్యాఖ్యలు.. విశాఖ నేతలకు దిశానిర్దేశం
స్థానిక ఎన్నికల వేళ జగన్ కీలక వ్యాఖ్యలు.. విశాఖ నేతలకు దిశానిర్దేశం విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా విశాఖ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని జగన్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలోనూ పలు మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీలో 1,000 ప్రొసీజర్లను 3,300కు పెంచామని, చికిత్స పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచామని చెప్పారు. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేశామని వివరించారు. వ్యవసాయ రంగంలోనూ రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అన్ని రంగాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. విశాఖలో విలువైన భూములను 99 పైసలకే కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఊరిలో మద్యం, గంజాయి అందుబాటులోకి వచ్చాయని, గుడి, బడి సమీపంలో కూడా ఇవి కనిపిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు నాంది పలికామని జగన్ తెలిపారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు పరిష్కారం చూపేందుకు హీర మండలం నుంచి సుమారు రూ.600 కోట్లతో తాగునీటి సరఫరా చేపట్టామని పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించిన 55 ఎకరాల భూమి వ్యవహారంపై కూడా జగన్ ఆరోపణలు చేశారు. ఆ భూముల విలువ కనీసం రూ.5 వేల కోట్లు ఉంటుందని, వాటిని అడ్డగోలుగా తమకు నచ్చిన వారికి, లోకేష్ తోడల్లుడికి అప్పగించారని ఆరోపించారు. విశాఖలో తొలిసారిగా నీటి ఎద్దడి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎత్తు 45.72 మీటర్లు ఉంటే మరో 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, అయితే ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు గట్టిగా పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ పాలనపై తమ వాదనను బలంగా వినిపించాలని నేతలకు సూచించారు.