పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.168.20 కోట్లతో జలజీవన్ మిషన్ 2.0 పనులు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా రూ.168.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న జలజీవన్ మిషన్ 2.0 పనులకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ పరిధిలోని 71 గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ.. పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు జలజీవన్ మిషన్ 2.0 ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధిలో తాగునీటి సరఫరాతో పాటు రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్య, వైద్యం, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జలజీవన్ మిషన్ 2.0 పనులు పూర్తయితే నియోజకవర్గంలోని 71 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.