స్థానిక ఎన్నికల సమన్వయకర్త దుర్గాపార్వతికి జనసేన నాయకుల అభినందనలు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలి సమన్వయకర్త దుర్గాపార్వతికి సీతానగరం జనసేన నాయకుల అభినందనలు
ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా నియమితులైన చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి మధుబాబుకు సీతానగరం జనసేన పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు దుర్గాపార్వతి మధుబాబు నాయకత్వం దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
అనంతరం చింతలపూడి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్వాహక దళ్ సభ్యులను ఏఎంసీ చైర్మన్ చీదరాల దుర్గాపార్వతి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్త సేవలు వెలకట్టలేనివని అన్నారు. పార్టీ లక్ష్యాల సాధనకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
తమ సేవలను గుర్తించి సత్కరించినందుకు నిర్వాహక దళ్ సభ్యులు, జనసేన పార్టీ శ్రేణులు దుర్గాపార్వతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం జనసేన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ ప్రతినిధులు, నిర్వాహక దళ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.