పరవళ్లు తొక్కుతున్న కట్టలేరు.. 20కిపైగా గ్రామాలకు రాకపోకలు బంద్
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో కురుస్తున్న విస్తార వర్షాలతో కట్టలేరు ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో వినగడప వద్ద కట్టలేరు పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి పెరగడంతో వంతెన వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి పూర్తిగా నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 20కిపైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మండలంలోని పలు వాగులు, వంకలు సైతం పొంగిపొర్లుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ప్రస్తుత వర్షాలు కొంత ఊరటనిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. అయితే వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కట్టలేరు వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున వాగులు, వంకలు దాటేందుకు ఎవరూ సాహసించవద్దని అధికారులు సూచిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా వాహనాలతో తాత్కాలిక రహదారులపై ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తమైంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.