లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే
ఉద్యమకారుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
NTODAY NEWS : చిట్యాల
జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇది ప్రభుత్వ హత్యేనని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చిట్యాల పట్టణంలోని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం ఆదుకోలేకపోవడం బాధాకరమన్నారు. 'బాపు బాగా చదివించాడు.. నేను ఉద్యమంలోకి పోయి జీవితం ఖరాబు చేసుకున్నాను' అంటూ లక్ష్మణ్ గౌడ్ రాసిన చివరి మాటలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొంటే ఉద్యోగాలు, గుర్తింపు లభిస్తాయని ఆశించిన ఉద్యమకారుడికి చివరకు అప్పులు, అవమానాలు, ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు మిగిలాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంఘం డిమాండ్లు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఆయన భార్య స్వప్నకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను విస్మరించే ప్రభుత్వాలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.