మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు
ప్రజల బాధలను అక్షరాల్లో ప్రతిబింబించిన కాళోజీ
విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ప్రిన్సిపాల్ జి. శంకర్
మధిర: ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ జి. శంకర్ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన రచనల ద్వారా సామాన్య ప్రజల బాధలు, ఆకాంక్షలు, సమాజంలోని అసమానతలను ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించడం ఆయన జీవితంలో ముఖ్యమైన లక్షణంగా మారిందన్నారు. అందుకే ప్రజలు ఆయనను ప్రేమగా ప్రజాకవిగా పిలుచుకుంటారని పేర్కొన్నారు.
విద్యార్థులు కాళోజీ నారాయణరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తప్పును చూసి మౌనంగా ఉండకుండా న్యాయం కోసం ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ కార్యక్రమ అధికారి బి. తౌరియా, ఆర్. లత, యు. కృష్ణ, పి. కమల, ఆర్.సి.హెచ్. సాంబయ్య, జి. కృష్ణ, కె. గురవయ్య, బి. ఉపేందర్, జి. విక్రమ్, టి. దేవదాస్, టి. నాగరాజు, ఎం. లాలయ్య, కె. కొండలరావుతో పాటు విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.