పుంగనూరులో నిజం గెలిచింది కొవ్వొత్తుల నిరసన
చంద్రబాబు అరెస్టు ఘటనను గుర్తుచేసుకుంటూ టీడీపీ శ్రేణుల నిరసన
పుంగనూరు | Ntoday News
అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీడీపీ నాయకుడు వై. మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబర్ 9న నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గతంలో అరెస్టు చేసిన ఘటనను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పటికీ ప్రజల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం మరింత బలపడిందని పేర్కొన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడిపై రూ.3 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారని, అనంతరం ఆ మొత్తాన్ని రూ.300 కోట్లు, ఆ తర్వాత రూ.30 కోట్లకు తగ్గించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చివరకు ఆరోపణలను నిరూపించలేకపోయారని, ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారని వారు పేర్కొన్నారు.
“నిజం గెలిచింది” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజాస్వామ్యంపై తమకు ఉన్న విశ్వాసాన్ని చాటేందుకే కొవ్వొత్తుల నిరసన నిర్వహించినట్లు తెలిపారు.
రాజకీయ కక్షసాధింపు చర్యలకు స్వస్తి పలకాలని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగే చర్యలు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.