వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ధర్మపురి, సెప్టెంబరు 9
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ధర్మపురి సీఐ రాం నరసింహ రెడ్డి, ఎస్‌ఐ సదాకర్ స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘానబట్ల దినేష్, 15 వార్డుల కౌన్సిలర్లతో కలిసి వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రతి వినాయక మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. భక్తులకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భారీ విగ్రహాల నిమజ్జన సమయంలో ఒకే మార్గం వైపు తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా యువత, ప్రజలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.