విస్సన్నపేట: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..
విస్సన్నపేట: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. ‘నిజం గెలిచింది’ నినాదంతో టీడీపీ నిరసన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా విస్సన్నపేటలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. విస్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో 53 దీపాలు వెలిగించి నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ బ్లాక్ డేగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధించిన ఘటనకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘నిజం గెలిచింది’ అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆనాడు తమ నాయకుడిని అక్రమంగా నిర్బంధించినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని చంద్రబాబు నిర్దోషిగా బయటకు వచ్చారని పేర్కొన్నారు. 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించి నాటి చీకటి రోజులను గుర్తుచేసుకోవడంతో పాటు నిజం, న్యాయం చివరకు విజయం సాధించాయనే సందేశాన్ని కార్యక్రమం ద్వారా చాటారు. ఈ సందర్భంగా వల్లభనేని ఎగిరి బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి నిర్బంధించిన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో చంద్రబాబును 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధించారని, ఆ సమయంలో పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదనకు గురయ్యాయని అన్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వచ్చిన అనంతరం నిజం గెలిచిందనే నమ్మకంతో ఈరోజు 53 దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. నాటి పరిణామాలను ఎప్పటికీ మరచిపోమని, కష్టకాలంలో చంద్రబాబుకు అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఐక్యతను గుర్తుచేసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ‘నిజం గెలిచింది.. ధర్మం నిలిచింది’ అంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులు తమ ఐక్యతను చాటుకున్నారు.