బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఆయుధాల డంప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. బేద్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకా పహాడి గ్రామ అటవీ ప్రాంతంలో గాలింపు, మందుపాతరల తొలగింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.
ఈ క్రమంలో అడవిలో భూగర్భంలో దాచిపెట్టిన మావోయిస్టుల డంప్‌ను గుర్తించారు. డంప్ నుంచి ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు, ఇన్సాస్ రైఫిళ్లు, .315 బోర్ గన్‌లు, బీజీఎల్ లాంచర్లు, బీజీఎల్ సెల్‌లు, చైనా తయారీ హ్యాండ్ గ్రెనేడ్లు తదితర భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులు ఆయుధాలను అడవిలో రహస్యంగా భూగర్భంలో దాచిపెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. గాలింపు చర్యలను మరింత విస్తృతం చేసినట్లు అధికారులు తెలిపారు.