తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు
ఎన్ టుడే న్యూస్: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నేడు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను పరిస్థితులు, విద్యుత్ సరఫరా అంతరాయాల నివారణ, పునరుద్ధరణ చర్యలపై సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో 48 గంటల్లో పునరుద్ధరించే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్‌తో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన ఇతర సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, మరమ్మతు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థల సీఎండీలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. స్థానికంగా తలెత్తే సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుఫాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను వీలైనంత వరకు తగ్గించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.