Khammam: కరాటే ఛాంపియన్‌షిప్‌లో మడుపల్లి విద్యార్థిని నవ్యశ్రీకి గోల్డ్ మెడల్
తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన తొమ్మిదో తరగతి విద్యార్థిని
ఎన్ టుడే న్యూస్: ఖమ్మం జిల్లా, మధిర: తెలంగాణ రాష్ట్రస్థాయి బుడోకాన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని పొడుగు నవ్యశ్రీ స్వర్ణ పతకం సాధించి పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. నవంబర్ 1, 2026న హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి తెలంగాణ రాష్ట్రస్థాయి బుడోకాన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నవ్యశ్రీ తన ప్రతిభను చాటుకుని గోల్డ్ మెడల్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందుకుంది.
విద్యార్థిని సాధించిన విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు. కరాటేలో నవ్యశ్రీకి శిక్షణ అందించిన మాస్టర్ కుమారి నిఖితతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేస్తే విజయాలు సాధించవచ్చని నవ్యశ్రీ నిరూపించిందని ప్రశంసించారు.
క్రీడల్లోనే కాకుండా చదువులోనూ నవ్యశ్రీ ప్రతిభ కనబరుస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన అంశాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యా కార్యక్రమాల్లోనూ రాణిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, నిరంతర సాధనతో ముందుకు సాగుతున్న నవ్యశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడం పట్ల మడుపల్లి గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.