ధర్మపురి పుష్కరాల అభివృద్ధి పనులపై మంత్రి అడ్లూరి సమీక్ష
జగిత్యాల: ధర్మపురిలో నిర్వహించనున్న పుష్కరాలకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి, మౌలిక వసతుల పనులపై జగిత్యాల కలెక్టరేట్‌లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.
పుష్కరాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని చైర్‌పర్సన్ కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో రోడ్ల అభివృద్ధి, రోడ్ల వెడల్పు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్ సదుపాయాలు, డంపింగ్ యార్డులు, ట్రాఫిక్ నియంత్రణ, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఘాట్ల నిర్మాణం, పట్టణ సుందరీకరణ తదితర అంశాలపై చర్చించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో సూచించారు. అవసరమైన పనులను శాఖల వారీగా సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగం పాల్గొన్నారు.