బేతూపల్లి చెరువు నీటిమట్టంపై మంత్రి తుమ్మల సమీక్ష
14 అడుగులకు చేరగానే వేంసూరు మండలానికి సాగునీరు విడుదల చేయాలని ఆదేశం
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. జలాశయాల నీటిమట్టం, వరద నీటి ప్రవాహం, సాగునీటి అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బేతూపల్లి చెరువు నీటిమట్టంపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ఇప్పటివరకు చెరువులో నీటిమట్టం 13 అడుగుల 7 అంగుళాలకు చేరినట్లు అధికారులు తెలిపినట్లు సమాచారం.
బేతూపల్లి చెరువు నీటిమట్టం 14 అడుగులకు చేరుకున్న వెంటనే సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలానికి సాగునీటిని విడుదల చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు జలాశయాలకు వరద నీరు చేరుతున్న నేపథ్యంలో రైతుల సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.
జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్న పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరాన్ని బట్టి సాగునీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు.