అన్నారంలో వెండితెరపై సినిమా ప్రదర్శన..
అన్నారంలో వెండితెరపై సినిమా ప్రదర్శన.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న గ్రామస్తులు
డొంకేశ్వర్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో హనుమాన్ గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక సినిమా ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలోనే థియేటర్ తరహాలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఉచితంగా సినిమా ప్రదర్శించడంతో గ్రామస్తులు సందడి చేశారు.
వివిధ కారణాలతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడలేని వారికి గ్రామంలోనే సినిమా చూసే అవకాశం కల్పించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకేచోట సినిమా వీక్షించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
భక్తిరస, యాక్షన్ అంశాలతో రూపొందిన ‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రదర్శించడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు సహా పలువురు గ్రామస్తులు ఆసక్తిగా సినిమా వీక్షించారు. అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంతో పాటు కుటుంబ అనుబంధాలకు సంబంధించిన అంశాలు ఉండటంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన 80, 90 దశకాలకు చెందిన పలువురు తమ చిన్ననాటి గ్రామీణ సినిమా ప్రదర్శనలు, ప్రొజెక్టర్ షోలు, టూరింగ్ టాకీస్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వినోదాన్ని అందించడంతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించిన హనుమాన్ గణేష్ మండలి యూత్ సభ్యులను గ్రామ పెద్దలు, యువత అభినందించారు.